న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయా దేశాల భవితవ్యం పూర్తిగా సాంకేతికత పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సిద్దమై ఉండాలని సూచించారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందన్నారు కేంద్ర మంత్రి. దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో జరిగిన 217వ కోర్సు సంయుక్త స్నాతకోత్సవ కవాతు లో ప్రసంగించారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, సెన్సార్లు, రోబోటిక్స్ , రాడార్ వ్యవస్థల వంటి సాంకేతికతలు ఆధునిక యుద్ధానికి రూపునిస్తున్నాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత వైమానిక దళం నుండి పట్టభద్రులవుతున్న క్యాడెట్లను భవిష్యత్ సంఘర్షణల కోసం సాంకేతికంగా నిపుణులుగా , మానసికంగా సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సంఘర్షణలలో సంప్రదాయ సైనిక మోహరింపుల కంటే అధునాతన వ్యవస్థల ద్వారానే యుద్ధాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. . ఈ రోజు మొత్తం 231 మంది ఫ్లైట్ క్యాడెట్లు పట్టభద్రులయ్యారు, వీరిలో 194 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారు. వీరితో పాటు 14 మంది అధికారులకు వింగ్స్ ప్రదానం చేశారు. “నేటి యుద్ధాలలో, సైనికులు, ఆయుధాలు తరచుగా యుద్ధభూమిలో కనిపించవు. ఆధునిక సంఘర్షణలు సాంకేతికతతో నడప బడుతున్నాయి. మీరు అప్రమత్తంగా, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వంతో ఉండాలని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా మీ ప్రతిస్పందనలను పునః సమీక్షించు కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు రాజ్ నాథ్ సింగ్. నిరంతర అభ్యాసం ఆవశ్యకతను నొక్కిచెబుతూ, కార్యాచరణలో ఆధిక్యతను సాధించడానికి క్యాడెట్లు పరిస్థితులకు అనుగుణంగా మారాలని, కొత్తదనాన్ని స్వీకరించాలని నూతన ఆవిష్కరణలు చేయాలని రక్షణ మంత్రి సలహా ఇచ్చారు.
