అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూనివర్శిటీల పాలక మండళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో 18 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. గతంలో వైసీపీ సర్కార్ హయాంలో ఏర్పాటైన పాలక మండళ్లతో పాటు , నామినేటెడ్ సభ్యులను తొలగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలలో కొత్త పరిపాలనా పర్యవేక్షణను తీసుకు రావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ చర్యను పరిగణిస్తున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమగ్ర పరిపాలనా పునర్వ్యవస్థీకరణ ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ‘క్లాజ్-2’ కింద నియమితులైన నామినేటెడ్ సభ్యులందరినీ తొలగించడంపై దృష్టి సారించింది.
అయితే క్లాజ్-1 ప్రకారం తమ పదవుల రీత్యా సేవలందిస్తున్న ఎక్స్-అఫీషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో మూడేళ్ల కాలపరిమితితో ఈ విశ్వ విద్యాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ నిర్ణయంతో, గతంలో నియమితులైన పాలక మండలి నామినేటెడ్ సభ్యులందరూ తొలగించబడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎస్వీయూ , ఆంధ్ర యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ, విక్రమ సింహపురి యూనివర్సిటీ, జేఎన్‌టీయూ గురజాడ, జేఎన్‌టీయూ అనంతపురం, జేఎన్‌టీయూ కాకినాడ, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, ద్రావిడ యూనివర్సిటీ, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ , శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు రద్దు చేయబడ్డాయి.
అయితే, ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ , పద్మావతి యూనివర్సిటీలకు కొత్త కౌన్సిళ్లను నియమించారు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు విశ్వ విద్యాలయాల పరిపాలనాపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ సందర్బంగా ఉన్నత విద్యలో నాయకత్వ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుసూదన్ రెడ్డి.
