తిరుపతి : తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాల్సి ఉంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంకో రాష్ట్రం ప్రాంతీయతను దాటాలి. మనమంతా భారతీయత వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అందుకే పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడేప్పుడు పథకాలు, చేసే పనులను చెప్పేందుకు మాత్రమే పరిమితం కావడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగం, సామాజిక నియంత్రణ, సామాజిక సమతుల్యత, జాతీయ సమైక్యత, భారతీయత, సామాజిక పరస్పర విశ్వాసం తదితర అంశాలపై మాట్లాడుతానని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పెదపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య పరిష్కారం చూపామన్నారు.
గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణల కోసం ఎన్నో కమిటీలు వచ్చాయి. బల్వంత్ మెహతీ, ఆశోక్ మెహతా, జీవీకే రావు, ఎల్.ఎన్.సింగ్ తదితరులు ఎన్నో సూచనలు చేశారు. ఇవన్నీ 1972వ 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 1993 నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. ఆర్టికల్ 243 నుంచి 243(ఓ) వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ కల్పించింది. 11 షెడ్యూల్ ద్వారా ఇందుకు సంబంధించి 22 అంశాలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ఇది ప్రపంచంలో అతిపెద్ద వికేంద్రీకరణ ప్రయోగం. దేశ వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఎన్నికైన 30 లక్షల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు, 14 లక్షల పైగా మహిళా ప్రజా ప్రతినిధులతో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద గ్రాస్ రూట్ ప్రయోగం. అన్ని వ్యయ ప్రయాసలకోర్చి చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా గ్రామానికి అధికారాన్ని ఇచ్చిందా? రాజ్యంగం ఇచ్చిన అధికారం సంపూర్ణంగా అమలయ్యిందా? నిధులు, నిర్ణయాధికారం, బాధ్యత గ్రామానికి చేరాయా? అంటే.. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేసిన రివ్యూల్లో అధికారులు తేల్చింది ఒకటేనని అన్నారు పవన్ కళ్యాణ్.
