శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసిందేమీ లేదని మండిపడ్డారు. చివరికి పెట్టుదారులను కూడా వదల్లేదని, వారిని కూడా బెడిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేసిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఒక సాగునీటి కాలువ కూడా పూర్తి చేశారా..? అని నిలదీశారు. జగన్ ఏమి చేశారని, క్రెడిట్ చోరీకి పాల్పడడానికి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డిది అంతా చోరీ క్రెడిట్ ననే, ఆ క్రెడిట్ తమకు అక్కర్లేదని అన్నారు.
ఆయన హయాంలో ఏయే ఒప్పందాలు జరిగాయో..? వివరించాలని మంత్రి నారా లోకేశ్ అడిగారని, దానికి వైసీపీ నేతలు ఎందుకు నోరెత్తడం లేదని మంత్రి సవిత ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పెనుకొండ నియోజక వర్గంపై గాని, పులివెందుల, ధర్మవరంలో అభివృద్ధి గురించి గాని తాను చర్చకు సిద్ధమని అన్నారు. వైసీపీ నాయకులు ముందుకు రావాలన్నారు. ప్లేస్ వారికి చెప్పమంటారా… తనకే చెప్పమంటారా…? అంటూ మంత్రి సవిత ఛాలెంజ్ చేశారు. గతంలో వలస పక్షుల పాలనలో పెనుకొండ నియోజక వర్గంలో అభివృద్ధి జాడేలేదన్నారు. మీటరు రోడ్డు కూడా వేయలేదన్నారు.















