చెన్నై : తమిళ సినీ నటుడు విశాల్ రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా తమిళనాడు సీఎం , అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను కలిశారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను నటుడిగా పరిణతి చెందాడని, అంతే కాకుండా ముఖ్యమంత్రి లాంటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ విజయ్ ఎప్పటి లాగే ఉన్నాడని కితాబు ఇచ్చాడు. తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఇది కొందరికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. లయోలా కాలేజీ రోజుల నుండి మిమ్మల్ని ‘డార్లింగ్’ (ప్రియమైన మిత్రమా) అని పిలుస్తూ వచ్చాను, ఆ పదం ఇప్పటికీ అలాగే ఉంది. ఒక వర్ధమాన నటుడిగా మిమ్మల్ని తెలుసు కోవడం దగ్గరి నుండి, అనేక సవాళ్లు, విమర్శలను మీ మౌనం, విజయాలతో అధిగమించి ‘సూపర్‌స్టార్’గా ఎదగడం, ఆపై తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరకు మీ ప్రయాణాన్ని నేను చూస్తూనే ఉన్నానని అన్నారు
ఈ రోజు మీ పదవి, హోదా మారాయి కానీ మీ వ్యక్తిత్వం మాత్రం మారలేదు. మిమ్మల్ని కలవడం, ఆ పాత ఆప్యాయతను మళ్లీ అనుభవించడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు విశాల్ రెడ్డి. కలైజ్ఞర్ అయ్య ఎంజీ రామచంద్రన్, జయలలిత అమ్మ, స్టాలిన్ అంకుల్, అలాగే నా సొంత ఉదయ్… ఇలాంటి వారి వరుసలో, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘డార్లింగ్’ అని పిలవడం ఎంతో ఆనంద దాయకంగా అనిపించిందన్నాడు. నాలోని అభిమాని ఎప్పటికీ అలాగే ఉంటాడని స్పష్టం చేశారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. సాధారణంగా ఇచ్చే పూలగుచ్ఛం, శాలువాను స్వీకరించ కూడదన్న నా అభ్యర్థనను అంగీకరించినందుకు ధన్యవాదాలు. దానికి బదులుగా ఆ డబ్బుతో తమిళనాడులోని ముగ్గురు అర్హులైన, ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువుకు మీ తరపున, మీ పేరుతో సహాయం చేశాను. వారు ఎప్పటికీ గర్వపడతారని, మిమ్మల్ని గుర్తుంచుకుంటారని అన్నారు. మీ హయాంలో అంతా మంచే జరగాలని, అభివృద్ధి సాగాలని కోరుకుంటున్నాను. తమిళనాడు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు విశాల్ రెడ్డి.
