మార్కాపురం జిల్లా : రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మార్కాపురం జిల్లా డోర్నాలలో పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో 3 గంటల పాటు సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు. వెలిగొండ పనులపై చంద్రబాబు ప్రత్యేక ద్రుష్టి పెట్టారని తెలిపారు. 2026 సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేసే లక్ష్యం కోసమే నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. టన్నెల్స్ లో లైనింగ్ పనులు నెమ్మదించడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి నిమ్మల సీరియస్ అయ్యారు. వెలిగొండ పనులపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెట్రోలు, డీజిల్, టన్నెల్సు నందు మనుషుల కొరత, యంత్రాల పెంపు వంటి సమస్యలను అధిగమించి లక్ష్యం మేర పనులు పూర్తి చేయాలని ఏజెన్సీను ఆదేశించారు మంత్రి నిమ్మల. 5 గ్యాంట్రీలతో చేస్తున్న లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. టన్నెల్-2లో 12వ కి.మీ దగ్గర చిక్కుకుపోయిన టిబిఎం మిషన్ తొలగించడానికి హైకోర్టు అనుమతిచ్చింది అని తెలిపారు నిమ్మల రామానాయుడు. టన్నెల్స్ నుండి 54 టిఎంసిల నీరు తరలించాలంటే టిబిఎం మెషిన్ తొలగించాల్సిందే నని పేర్కొన్నారు టిబిఎం మెషిన్ ను తొలగించడానికి వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించిన మంత్రి నిమ్మల. త్వరలోనే నిర్వాసితుల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ బిల్లులు జమ చెయ్యడం ప్రారంభిస్తాం అని ప్రకటించారు.
















