Home Minister Anitha : అమరావతి : ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రాష్ట్రంలో యూరియా స్కాం జరిగిందని పదే పదే చెప్పడం దారుణమన్నారు. కొన్ని అసత్యమైన, అబద్ధపు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శలు బక్వాస్ అని పేర్కొన్నారు. వీళ్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అందుకే ప్రజలు వైసీపీని, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ రెడ్డికి చుక్కలు చూపించారని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అయినా జగన్ కు ఆయన పరివారానికి బుద్ది రావడం లేదన్నారు వంగలపూడి అనిత.
AP Home Minister Anitha Slams
స్కాంల పేరుతో కల్పిత ఆరోపణలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదన్నారు. ఇది తప్పుడు ప్రచారం, క్రిమినల్ డిఫమేషన్, వ్యక్తిత్వ హననం కిందకు వస్తుందన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఖచ్చితమైన చట్టపరమైన చర్యలకు గురవుతాయని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద నిజమైన ఆధారాలు ఉన్నాయనుకుంటే, వాటిని తక్షణమే దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని డిమండ్ చేశారు వంగలపూడి అనిత. ప్రెస్ మీటింగులు, సోషల్ మీడియా పోస్టులు, రాజకీయ సభలలో ఆధారాలు లేకుండా అబద్ధాలు చెప్పడం అస్సలు సహించే ప్రసక్తి లేదన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఎన్నికైన నాయకుల గౌరవాన్ని దెబ్బ తీయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు సమాజంలో అసత్యానికి విలువ పెంచి, ప్రజా చర్చల నాణ్యతను అపహాస్యం చేస్తాయన్నారు హోం శాఖ మంత్రి. ఆధారం లేని ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు. దుష్ప్రచారం చేసిన వ్యక్తులు లేదా సంస్థలపై క్రిమినల్ , సివిల్ చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read : Anil Ambani Shocking : ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై మరో కేసు
