లాయ‌ర్ అయిన చంద్ర‌గిరి ఎమ్మెల్యే భార్య

ఏపీ బార్ కౌన్సిల్ లో ‘ఎన్రోల్‌మెంట్’ పట్టా స్వీకరణ

hellotelugu-PulivarthiSudhaReddy

విజ‌య‌వాడ : చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని (వెంకటమణి ప్రసాద్) సతీమణి పులివర్తి సుధారెడ్డి విజయవాడలో జరిగిన అధికారిక సమావేశంలో ఏపీ బార్ కౌన్సిల్ నుంచి న్యాయవాద ఎన్రోల్‌మెంట్ పట్టాను అందుకున్నారు. ఇటీవల చంద్రగిరి మండలంలోని కెఎంఎం కళాశాల పరీక్షా కేంద్రంలో ఆమె ‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్–21’ (AIBE–21) పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఘన విజయం సాధించిన అనంతరం, విజయవాడలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక సమావేశంలో ఆమె న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకుని, చట్టబద్ధంగా తన ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్‌ను స్వీకరించారు.

లాయర్‌గా పట్టా పొందిన అనంతరం పులివర్తి సుధారెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన మనోభావాలను పంచుకున్నారు. నేటి నుంచి నన్ను నేను లాయర్ పులివర్తి సుధారెడ్డి అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా, సద్భావంగా ఉందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మహిళలుగా మనం అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సుధారెడ్డి. ఒక మహిళగా, భార్యగా, తల్లిగా, అత్తగా కుటుంబ బాధ్యతలు చక్క బెట్టడంతో పాటు, అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చేలా మనల్ని మనం ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ముందుకు వెళ్లాల‌న్నారు.

ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ పెద్దలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదువుకు అంతం లేదు, ప్రతిదీ ఒక కొత్త ఆరంభమే.. ఏదైనా అనుకుంటే సాధించి చూపాలని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. లాయర్‌గా పట్టా అందుకుంటున్న ఈ శుభ తరుణంలో మా తండ్రిని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నాను. అలాగే సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మనిషి చని పోయేంత వరకు ఏదో ఒకటి సాధిస్తూనే ఉండాలని మా అత్త కూడా ఎప్పుడూ ఆకాంక్షించే వారు. గతంలో కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వ్యాపారాల వల్ల సమయం దొరకలేదు. కానీ ప్రస్తుతం నా భర్త పులివర్తి నాని ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపార రంగంలో మా కుమారుడు వినీల్ బాబు అన్ని బాధ్యతలను చూసుకుంటూ నాకు పూర్తి మద్దతుగా నిలవడంతోనే నేను ఈరోజు నా పట్టుదల, కృషితో లాయర్ కాగలిగాను. ఈరోజు మా అత్త బతికి ఉంటే ఎంతో సంతోషించేవారు అని సుధారెడ్డి పేర్కొన్నారు.

సమాజంలో ప్రశ్నించడానికి కేవలం గొంతు ఒక్కటే ఉంటే సరిపోదని, చట్టబద్ధమైన అధికారం (న్యాయ పరిజ్ఞానం) కూడా తోడైతేనే అన్యాయాన్ని నిలదీసి, సామాన్యులకు న్యాయం చేయగలుగుతామని, అందుకే తాను ఎంతో పట్టుదలగా న్యాయ విద్యను అభ్యసించానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని ఎంతో ఆదరించారని, ప్రజల నమ్మకానికి అనుగుణంగానే తాము కూడా నిరంతరం ప్రజల కోసమే మారుతూ, సేవ చేస్తూ వస్తున్నామని తెలిపారు. తన విజయానికి కారణమైన, ఎల్లప్పుడూ ప్రోత్సహించిన తన కుటుంబ సభ్యులకు, కుటుంబంతో సమానమైన పార్టీ కార్యకర్తలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version