UPI Growth in India : యూపీఐ లావాదేవీల్లో టాప్ లో భారత్

ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది...

Hello Telugu - UPI Growth in India

Hello Telugu - UPI Growth in India

UPI : భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మన్ననలు పొందుతోంది. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీల పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

UPI – నెలకు 1800 కోట్ల లావాదేవీలు

ప్రస్తుతం భారత్‌లో ప్రతి నెలా సగటున 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని IMF వెల్లడించింది. 2025 జూన్‌ నెలలో మాత్రమే యూపీఐ ద్వారా జరిగిన మొత్తం మార్పిడి విలువ రూ.24.03 లక్షల కోట్లు, లావాదేవీల సంఖ్య 18.39 బిలియన్. 2024 జూన్‌లో ఈ సంఖ్య 13.88 బిలియన్గా ఉండగా, ఒక్క ఏడాదిలో 32 శాతం వృద్ధి నమోదైంది.

వినియోగదారుల సంఖ్యలో విస్తరణ

ఇప్పటికే 49.1 కోట్ల మంది సాధారణ వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నాయి. ఫలితంగా చిన్న స్థాయి వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద కంపెనీల వరకు డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్నాయి.

దేశీయ చెల్లింపుల్లో యూపీఐ ఆధిక్యం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ లావాదేవీలలో 85 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని IMF పేర్కొంది.

అంతర్జాతీయ విస్తరణలో యూపీఐ

యూపీఐ సేవలు ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇకపై బ్రిక్స్ దేశాల్లోనూ ఈ సేవలను విస్తరించేందుకు భారత రిజర్వ్ బ్యాంకు (RBI) చర్చలు జరుపుతోంది.

ప్రజల్లో విశ్వాసానికి కారణం

యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులు సురక్షితంగా, వేగంగా, మరియు సులభంగా ఉండటమే దీని ఆదరణకు ప్రధాన కారణం. ఇక నగదు వాడకాన్ని తగ్గించి లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read : Gold Price Growth : చూస్తుండగానే ఒకే రోజులో మరోసారి పెరిగిన పసిడి ధరలు

Exit mobile version