అమెరికా : డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా భారత్ పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తాము ఇండియాకు బేషరతుగా మద్దతు ఇస్తామని ఇటీవలే ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే టారిఫ్ ల పేరుతో భారత మార్కెట్ ను శాసిస్తూ వచ్చింది సదరు దేశం. అయితే ఇండియాతో కీలకమైన వాణిజ్య పరమైన ఒప్పందం చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించింది .పరస్పర ప్రయోజనకరమైన , సమానమైన నిబంధనలతో అమెరికా ఉత్పత్తులకు 140 కోట్ల జనాభా కలిగిన భారతీయ మార్కెట్‌ను ఈ ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అందుబాటులోకి తెస్తుందని పేర్కొంది.
క్యాపిటల్ హిల్‌లో ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బెథానీ పౌలోస్ మోరిసన్ మాట్లాడుతూ ఈ కీలక అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫలితాల ఆధారిత సంబంధాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ , మోదీ మధ్య కుదిరిన అవగాహన తర్వాత ప్రారంభమైన వాణిజ్య చర్చల గురించి ప్రస్తావించారు.
తాము ఈ సంబంధాన్ని కేవలం సమావేశాల ద్వారా అంచనా వేయడం లేదు, ఫలితాల ద్వారా అంచనా వేస్తున్నామని ఆమె చెప్పారు. ఫిబ్రవరి 2026లో వాణిజ్య అంశాలను పరిశీలించినప్పుడు, ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించడం జరిగిందన్నారు.
