తిరుమల : పుణ్య క్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారి ఆలయంలో రాత్రి పౌర్ణమి గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ జెబుతున్నాడు.
ఇదిలా ఉండగా గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టిటిడి) విస్తృత ఏర్పాట్లు చేసింది. అంతే కాకుండా రోజు రోజుకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్త బాంధవులు కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా మొన్న ఒకే రోజు లక్షకు పైగా భక్తులు రావడం విస్తు పోయేలా చేసింది. దీంతో బ్రేక్ దర్శనాలతో పాటు శ్రీవారి టికెట్లను రద్దు చేసింది టీటీడీ.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు శాంతారామ్, పనబాక లక్ష్మి, జానకి దేవి, డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
