తిరుమల : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల, ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 01, 2026 వరకు స్వీకరిస్తారు. తిరుపతి, భీమవరం, వరంగల్ ప్రాంతాల్లోని ఈ విద్యాసంస్థల్లో చేరదలచిన బధిర విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రతి ఏడాది 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర తరగతుల్లో ఖాళీల మేరకు ప్రవేశాలు ఉంటాయి.
తిరుపతిలో 1వ తరగతి చేరాలనుకునే అభ్యర్థులకు, 2వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ఖాళీలను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు. సదరు తరగతులతో పాటు ఇంటర్మీడియట్ మెదటి సంవత్సరం ప్రవేశాలకు తిరుపతి కళాశాల లేదా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులను తిరుపతి ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల నుండి నేరుగా పొందవచ్చు లేదా www.tirumala.org వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను ఇంఛార్జి ప్రిన్సిపాల్, ఎస్వీడిఎఫ్, అలిపిరి, తిరుపతి – 517501 చిరునామాకు పంపాలి. తిరుపతి అలిపిరి సమీపంలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ బధిరోన్నత పాఠశాల , ఎస్వీ బధిరుల జూనియర్ కళాశాల బధిర విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
