కోల్ కతా : దుర్గా పూజ సమయంలో మాంసాహారంపై ‘ఆదేశం’ ఇచ్చినందుకు భాగేశ్వర్ బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బెంగాల్ కాంగ్రెస్. ఆధ్యాత్మిక గురువు , తనను తాను దైవ పురుషుడిగా చెప్పుకునే ధీరేంద్ర శాస్త్రి పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా దుర్గా పూజ సందర్భంగా మాంసాహారం తీసుకోకూడదంటూ భాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి జారీ చేసిన ఆదేశం బెంగాలీల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, సమాజంలో అశాంతిని సృష్టించే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవానీపూర్ పోలీస్ స్టేషన్ అధికారికి సమర్పించిన ఫిర్యాదులో, సెప్టెంబర్ 5న హౌరాలో జరిగిన ఒక కార్యక్రమంలో శాస్త్రి “అవమానకరమైన” వ్యాఖ్యలు చేశారని సౌత్ కోల్‌కతా జిల్లా కాంగ్రెస్ కమిటీ పేర్కొంది.
తక్షణమే పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అవసరమైన అరెస్టులు చేయాలి అని కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ ప్రసాద్ ఆ ఫిర్యాదులో కోరారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్త చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఆరోపించింది. భాగేశ్వర్ బాబా’గా ప్రసిద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక గురువు, దుర్గా పూజ ఉత్సవాల సమయంలో మాంసాహారాన్ని మానేయాలని బెంగాలీలకు పిలుపునిచ్చారు. అలాగే మతపరమైన సందర్భాల్లో మాంసం తినే వారిని “కపట భక్తులు” అని అభివర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది.
