మ్యూజియం పనులను సకాలంలో పూర్తి చేయాలి

టీటీడీ అధికారుల‌ను ఆదేశించిన అడిష‌న‌ల్ ఈవో

hellotelugu-AdditionalEO

తిరుమల : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు తమకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలో సంబంధిత అధికారులతో మ్యూజియం ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యూజియంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు ఏఈవో. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా మ్యూజియం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై టీసీఎస్‌ బృందానికి కూడా అవసరమైన సమాచారం, సూచనలు అందించాలని ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు .బ్రహ్మోత్సవాల సందర్భంగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని పేర్కొన్నారు ఏఈవో. అనంతరం తిరుమలలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ, సెల్‌ టవర్ల పనితీరుపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలతో పాటు కాలిబాటలు, ఘాట్‌ రోడ్లలో భక్తులకు మెరుగైన మొబైల్‌ నెట్‌వర్క్‌ సదుపాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గరుడసేవ రోజున భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ఆ రోజు మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్‌ సేవలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రస్తుతం తిరుమల, ఘాట్‌ రోడ్లు, కాలిబాటల్లో ఎన్ని సెల్‌ టవర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎన్ని పని చేస్తున్నాయనే అంశాలను అధికారులు, సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు. అందుబాటులో ఉన్న అన్ని సెల్‌ టవర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా సంబంధిత సరఫరాదారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి కమ్యూనికేషన్‌ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి, నెట్‌వర్క్‌ వ్యవస్థను పటిష్టంగా సిద్ధం చేయాలని వెంకయ్య చౌద‌రి ఆదేశించారు.

Exit mobile version