తిరుపతి జిల్లా : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా, భక్తులకు పూర్తి భద్రత, సౌకర్యాలు కల్పించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కాణిపాకం దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై సంబంధిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, దేవస్థానం ఈఓ పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు, బోర్డు సభ్యులు, ఉభయదారుల సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం పూర్తి స్థాయిలో అమలు కావాలని అన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలు, దర్శనానికి వేచి ఉండే సమయాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్, లైటింగ్, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను మెరుగు పరుస్తున్నట్లు వెల్లడించారు.
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే ఏ భక్తుడూ అసౌకర్యానికి లేదా అభద్రతకు గురికాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. 21 రోజుల పాటు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారికి సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల భద్రత కోసం ప్రస్తుతం ఉన్న 161 సీసీ కెమెరాలకు అదనంగా మరో 50 వ్యూహాత్మక ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఎస్పీ తుషార్ . అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు, అగ్నిప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫైర్ సేఫ్టీ వాహనం, అదనపు అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ నిర్వహించే పూజలు నిర్ణీత సమయానికి ప్రారంభమై, నిర్ణీత సమయానికే ముగిసేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఆలయ చైర్మన్, ఈఓ, అర్చక పెద్దలు, ఉభయదారుల సంఘం ప్రతినిధులు సమన్వయంతో పూజల సమయాలను నిర్ణయించనున్నట్లు తెలిపారు. భక్తుల రవాణా సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, రాత్రి వేళ భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రతిరోజూ రాత్రి 11.30 గంటలకు కాణిపాకం నుంచి జిల్లా కేంద్రానికి బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక గ్రామం నుంచి సుమారు 50 మంది భక్తులు వస్తే, ఆర్టీసీని సంప్రదించిన వారికి నిబంధనల ప్రకారం తక్కువ ఛార్జీతో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి, దర్శనం అనంతరం తిరిగి గ్రామానికి చేర్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
వినాయక చవితి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించినట్లు, ప్రభుత్వ ప్రతినిధిని పంపించే అంశంపై కూడా చర్చ జరిగినట్లు వెల్లడించారు.
