Tirumala : తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7 సాయంత్రం 3.30 గంటల నుండి సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటల వరకు దాదాపు 12 గంటల పాటు తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపింది.
Tirumala Temple Will Close
సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్ 8న సోమవారం వేకువ జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీ.
సెప్టంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టంబర్ 7వ తేదీ ఆదివారం ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ (TTD) రద్దు చేసింది.
సెప్టంబర్ 7న తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూసి వేస్తన్నట్లు తెలిపింది.
చంద్రగ్రహణం కారణంగా సెప్టంబర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్న ప్రసాదాల వితరణ వుండదు. తిరిగి సెప్టంబర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.
భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు.
శ్రీ వారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది.
Also Read : Siddhi Vinayaka Popular Festival : ఘనంగా వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
