ఐక్య‌రాజ్య స‌మితి నాయ‌క‌త్వ బాధ్య‌త వ‌హించాలి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి జై శంక‌ర్

helloteluguSJaiShankar

న్యూఢిల్లీ : కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఐక్య‌రాజ్య స‌మితి పై. ఐక్యరాజ్యసమితి కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా ప్రపంచ సంక్షోభాల పరిష్కారంలో నాయకత్వ బాధ్యత వహించాలని స్ప‌ష్టం చేశారు. లేక పోతే త‌న ప్రాధాన్య‌త త‌గ్గిపోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలతో కూడిన బహుపాక్షికత ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి తన లోపాలను గుర్తించి, ప్రపంచ నిర్ణయాధికార ప్రక్రియలో మరింత విస్తృత ప్రాతినిధ్యాన్ని కల్పించేలా సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఐక్యరాజ్యసమితి నాయకత్వ బాధ్యతను ప్రదర్శించాలని, తన పరిమితులను అంగీకరించి, అంతర్జాతీయ నిర్ణయాధికార ప్రక్రియను మరింత సమ్మిళితం చేసేలా సంస్కరణల దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.

ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జై శంక‌ర్ ప్ర‌సంగించారు. ఐక్యరాజ్యసమితి కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకూడదని, తన లోపాలను సరిదిద్దుకుని మెరుగు పరుచుకోవాలని జైశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ స్టీఫెన్ ప్రీస్నర్ కూడా పాల్గొన్నారు. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమం చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడింది. ఎనిమిది దశాబ్దాల క్రితం ఐక్యరాజ్యసమితిని స్థాపించినప్పుడు, ప్రపంచ దేశాల మధ్య సహకార స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని జైశంకర్ గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని మొదటి అధికరణం, ఉమ్మడి లక్ష్యాలను సాధించే క్రమంలో “దేశాల చర్యలను సమన్వయం చేసే” కేంద్రంగా ఈ సంస్థ ఉండాలని పేర్కొందని ఆయన వివరించారు. ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో, మనం ఏకత్వ భావనను ముందుకు తీసుకెళ్లడం సముచితం అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు లేదా అవకాశాలు ఏవైనా సరే, వాటిని సమిష్టిగా, అత్యంత సమర్థవంతంగా పరిష్కరించు కోవచ్చు అని పేర్కొన్నారు జైశంక‌ర్ .

Exit mobile version