అమరావతి : ఆర్నబ్ తుపాను ప్రభావం రానుందని ఇప్పటికే వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం తమతమ ప్రాంతాల్లో సహాయక చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తూ ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు సీఎం. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఆర్నబ్ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావానికి అనుగుణంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆస్తి, ప్రాణ నష్టం జరక్కుండా చూడాలని అన్నారు. తుపాను ప్రభావంతో కురిసే వర్షాలు, గాలులు వరద ప్రవాహాల తీవ్రతను అంచనా వేస్తూ తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
.
*గతంలో వచ్చిన తుపాన్ల సమాచారాన్ని విశ్లేషిస్తూ రైతులకు, ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరించాలని అన్నారు సీఎం. తీరప్రాంతాల ప్రజల్ని తుపాను షెల్టర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ సహా విపత్తు నిర్వహణ, వర్చువల్ గా హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షకు. తుఫాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, కంది తదితర పంటలను వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచు కోవాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని, వరి పైరుపై వర్షాల సమయంలో యూరియా, ఇతర ఎరువుల పైపూతను వాయిదా వేయాలని సూచించారు. పత్తిలో పింక్ బోల్‌వార్మ్, తామర పురుగులు, మొక్కజొన్నలో కాండం కుళ్లు, కత్తెర పురుగు, వేరుశనగలో టిక్కా ఆకుమచ్చ, వేరు కుళ్లు, పప్పుధాన్యాల్లో కాయ తొలుచు పురుగుల ఉధృతిని వర్షాల అనంతరం పరిశీలించాలన్నారు. తడిసిన పత్తి, ధాన్యం, కాయలు, గింజలను పూర్తిగా ఆరబెట్టిన తరువాతే నిల్వ చేయాలని తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి సహాయక చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు
