శ్రీసత్యసాయి జిల్లా : వాల్మీకి మహార్షి స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. వాల్మీకీలు, బోయల రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు సీఎంతో సాధ్యమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాల్మీకి, బోయలకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించిన రామాయణం చారిత్రాత్మకమైనదని, ప్రపంచ ప్రఖ్యాత కాంచిందని తెలిపారు. భార్యా భర్తల బంధానికి, అన్న దమ్ముల అనుబంధానికి, కుటుంబ బాంధవ్యాలకు రామాయణం ఎంతో స్ఫూర్తి ఇస్తోందన్నారు. రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్న విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రామరాజ్యం నడుస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని జోరు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నారన్నారు ఎస్. సవిత. బీసీల ఉన్నతికి కోసం ఆనాడు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా బీసీలకు అగ్ర తాంబూలం వేస్తున్నారన్నారు. బీసీల్లో భాగమైన వాల్మీకీలు, బోయలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపునిచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఎందరో వాల్మీకి, బోయ నాయకులకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా అవకాశమిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ ది, సీఎం చంద్రబాబు దేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వాల్మీకి, బోయ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. సోమందేపల్లి, గోరంట్ల ఎంపీపీ స్థానాలతో పాటు పలు ఎంపీటీసీ స్థానాలు, సర్పంచులుగా కేటాయించామన్నారు. పెనుకొండ నియోజక వర్గానికి చెందని వ్యక్తికి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించామన్నారు. వాల్మీకి, బోయల అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
