న్యూఢిల్లీ : కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో ఒక సాధనంగా ఉపయోగించడం అంగీకార్యం కాదన్నారు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పినప్పటికీ కొందరు ఇప్పటికీ రాజకీయ లెక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన చెందారు. అయితే, ఆయన ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ విధానంలో ఉగ్రవాదం ఒక సాధనంగా” ఉపయోగించడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని, దీనిని ఎప్పటికీ సమర్థించలేమని లేదా హేతుబద్ధం చేయలేమని స్పష్టం చేశారు. కొన్ని దేశాలు ఈ ముప్పు పట్ల పూర్తి అసహనాన్ని ప్రదర్శించక పోవడం వల్లే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతోందని ఆయన ఎత్తిచూపారు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో శాంతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు యుద్ధం జరిగినా అది ప్రతిచోటా శాంతికి ముప్పు కలిగిస్తుంది అని హెచ్చరించారు జై శంకర్ . ఉక్రెయిన్ , పశ్చిమ ఆసియాలలో జరుగుతున్న రెండు ప్రధాన సంఘర్షణలను ఉదహరిస్తూ ఈ వివాదాలతో సంబంధం లేని దూర ప్రాంతాల్లోని సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు , ప్రజలు కూడా దీని మూల్యాన్ని చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మనం నిస్సహాయ ప్రేక్షకులుగా ఉండి పోలేమని అన్నారు కేంద్ర మంత్రి. చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కార మార్గాలని భారత్ నొక్కి చెబుతోందని మరోసారి స్పష్టం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిప్రాయానికి ప్రతిబింబం అని విదేశాంగ మంత్రి అన్నారు. శాంతి స్థాపన కోసం భారత్ కృషి చేస్తోందని, ఈ దిశగా ఇతర భాగస్వాములతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
