చెరువుల పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలి

సున్నం చెరువు, తమ్మిడికుంటలను ప‌రిశీల‌న

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని సున్నం చెరువుతో పాటు తమ్మిడికుంట పరిసరాలను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. చెరువుల నుండి పూడికను పూర్తిగా తొలగించడం, వాటి లోతును పెంచడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. చెరువుల చుట్టూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని సూచించారు. చెరువుల చుట్టూ పటిష్టమైన కంచె ఏర్పాటు, నడక దారులు, పచ్చదనాన్ని పెంచే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా పండుగ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రెండు చెరువులు ప్రారంభించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ అభివృద్ధి పనులను ప‌రిశీలించారు. సున్నం చెరువులోకి నీరు వచ్చే కాలువ వద్ద కల్వర్టు నిర్మాణంతో పాటు అక్కడి నుండి నిర్మిస్తున్న‌ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గాయత్రీనగర్ , బోరబండ ప్రాంతాల నుండి చెరువుకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

చెరువు అభివృద్ధితో పాటు దాని పరిసరాలను కూడా అందంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సున్నం చెరువు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ను కలిశారు స్థానికులు, గతంతో పోలిస్తే సున్నం చెరువులో ఎంతో మార్పు కనిపిస్తోందని అభినందించారు. చెరువు నిండా నీరు ఉంటే అది మరింత అందంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. అనేక అడ్డంకులు, సవాళ్లను అధిగమించి చెరువును ఇంత అందంగా అభివృద్ధి చేసినందుకు అభినందించారు. ఎన్ కన్వెన్షన్’ తొలగింపు , తమ్మిడికుంట అభివృద్ధి తీరును కూడా పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఈ రెండు చెరువుల చుట్టూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కమిషనర్ సీఎంసీ కమిషనర్ సృజ‌న్ తో కలిసి సమీక్షించారు.

Exit mobile version