అమరావతి : వివేకానంద రెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనే అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తప్పులు తాము చేస్తూ ఇతరులపై ఎదురుదాడికి దిగడం గొడ్డలి పార్టీ నాయకులకు నిత్యకృత్యంగా మారిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సంస్కృతిని పెంచి పోషించిందే గత వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. గురువుల మీదకు రౌడీషీటర్లను, సంఘ విద్రోహ శక్తులను పంపి దాడులు చేయించడం, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి పైశాచిక చర్యలను సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. అనారోగ్యంతో ఉన్న కాకుమాను రాజశేఖర్‌ను బలవంతంగా ధర్నాకు పిలిపించి, సరైన సమయంలో చికిత్స అందించకుండా ప్రాణాలు కోల్పోయేలా చేసి, ఇప్పుడు ఆయన మరణంపై కూడా శవ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలి పోటుకు గురై రక్తపు మడుగులో పడి ఉంటే, ఆనాడు రక్తపు మరకలను కడిగేసి గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కాదా అని మంత్రి నిలదీశారు. అప్పట్లో గుండెపోటు నాటకం ఆడి చంద్రబాబు నాయుడుపై నెపం నెట్టాలని చూసినట్లే, నేడు కూడా ప్రతి అంశంలోనూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటే ఐదేళ్ల పాటు ఆ కుటుంబాలు తీవ్ర భయాందోళనలతో గడిపాయన్నారు. 2019కి ముందు సీబీఐ విచారణ కావాలని కోరిన జగన్, తీరా దర్యాప్తు ముమ్మరమై కర్నూలు ఆసుపత్రి వద్దకు సీబీఐ అధికారులు వచ్చినప్పుడు బాంబులు వేస్తామని బెదిరించి, అధికారులపైనే అక్రమ కేసులు బనాయించి తరిమికొట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. జగన్‌కు సొంత బాబాయ్, కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి ఎవరైనా సరే కేవలం అధికారంకోసం వాడుకోవటమే తెలుసని, దోచుకున్న డబ్బు దాచుకోవడమే పరమావధిగా జగన్ జీవితం మారిందని విమర్శించారు.
