న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకంపై , ప్రధానంగా చీఫ్ ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం పనితీరు, సీఈసీ ఒంటెత్తు పోకడ, కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యం, తదితర అంశాలపై పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా తీసి వేస్తారంటూ ప్రశ్నించారు దావాలలో. ఇదిలా ఉండగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకునే విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించనున్నట్లు వెల్లడించింది సుప్రీంకోర్టు . ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఈ పిటిషన్ ఆరోపించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చీ , వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, చట్టపరమైన నిబంధనల ప్రకారం బహుళ సభ్యులు కలిగిన ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే, ఆ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నవేనా అనే దానిపై తీవ్ర అనుమానాలు కలుగుతున్నాయి అని ఆయన వాదించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కు సంబంధించిన నిర్ణయాలు , ఉత్తర్వుల విషయంలో, తమకు తెలియకుండా లేదా తమ సిఫార్సు లేకుండా జారీ చేశారంటూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు , వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు రాతపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన నివేదిక నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
