హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ కన్వీనర్ ఆకునూరి మురళి. విద్యపై అవగాహనను ప్రజల్లో పెంపొందించడం, దాని కోసం ప్రజల డిమాండ్‌ను పెద్ద ఎత్తున నిర్మించడం మాత్రమే మార్గమనే ఏకాభిప్రాయం ఉందన్నారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులు, కార్యకర్తలు, విద్యారంగ నిపుణులతో రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించారు. పాఠశాల విద్యలో పెరుగుతున్న సంక్షోభాన్ని ఎత్తి చూపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ విద్యా ఖర్చులను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ తన పన్నెండు రోజుల ఎడ్యుకేషన్ బస్ యాత్రలో భాగంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో రౌండ్ టేబుల్ సమా శాన్ని నిర్వహించింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఖమ్మం నగరానికి చెందిన మేధావులు, కార్యకర్తలు, విద్యావేత్తలతో పాటు టీపీఎఫ్ కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించి, బలోపేతం చేయడం, వాటికి తగిన మౌలిక వసతులు, సౌకర్యాలు, ఉపాధ్యాయులను సమకూర్చడం, నాణ్యమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రజల్లో డిమాండ్‌ను నిర్మించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రైవేట్ విద్యా సంస్థలపై నియంత్రణ ఉండేలా చేయడానికి మార్గమని వక్తలు అభిప్రాయపడ్డారు.


















