హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేరడానికి నాలుగు కోట్ల ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని అన్నారు. గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మ గౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ఈ చారిత్రక సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఆత్మ గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ల ప్రజా పాలనకు పునాదులు. సెప్టెంబర్ 17వ తేదీ మన బాధ్యతను కూడా గుర్తు చేసే రోజు. ఈ చారిత్రక నేపథ్యం, ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలి. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డలకు మంచి చదువు, మంచి వైద్యం అందాలి. యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలి. తరతరాల అణిచివేత, దోపిడీ, భూస్వామ్య, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు పుట్టినిల్లు తెలంగాణ. అస్తిత్వం, ఆత్మ గౌరవం, హక్కుల కోసం ఈ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించింది అని గుర్తు చేశారు సీఎం.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందని పేర్కొన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం ఇది. అందుకే 17ను మనం “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నాం అని చెప్పారు. ప్రజా పాలన అఅంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం. వారి హక్కులను కాపాడడం. ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడం. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మ గౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నాం అన్నారు సీఎం. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కు చేరిందని పేర్కొన్నారు. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం అని వెల్లడించారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే మా లక్ష్యం స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం అన్నారు. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయట పడేశామని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.. సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని పేర్కొన్నారు సీఎం. 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేశామన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపోరాటం చేస్తున్నాం అన్నారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, ఎస్ఎల్‌బీసీతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ సగర్వంగా జీవించాలి. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది అని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఈ ప్రయాణాలతో మన ఆడబిడ్డలకు రూ.12,385 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందన్నారు సీఎం. గృహజ్యోతి కింద 53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1 లక్ష 68 వేల మంది ఆడబిడ్డలకు రూ. 4,709 కోట్ల సహాయం చేశాం అని తెలిపారు.
54 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.60 వేల 487 కోట్ల బ్యాంకు లింకేజీ, రూ. 1,900 కోట్ల వడ్డీ రాయితీ కల్పించాం. మహిళా మార్ట్‌లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులతో మహిళల ఆదాయం పెంచుతున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 3.42 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. 15 లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశాం. 43 లక్షలకు పైగా మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నాం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద సుమారు రూ. 31 వేల కోట్లు అందించామని తెలిపారు. తాజాగా మరో 2.25 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందన్నారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో నివసించాలనేది మా ప్రభుత్వ ఆశయం. ఇందిరమ్మ ఇళ్ల తొలి దశలో రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు అందించాం. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించాం అని తెలిపారు సీఎం.


















