కరీంనగర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తన వల్ల మేలు కంటే రాష్ట్రానికి కీడు ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఆచరణకు నోచుకోని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని , ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు జీవన్ రెడ్డి.
ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డిపై పూర్తి స్థాయిలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆయన పోతేనే రాష్ట్రం బాగు పడుతుందని నినాదాలు చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. తను పోతేనే పీడ విరుగడ అవుతుందని అంటున్నారని, ఇలాంటి సీఎంను తాను చూడలేదన్నారు. కేవలం రెండేళ్లలోనే పరిస్థితి మారిందన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఈ మార్పు రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం పడుతోందన్నారు. సంక్షేమం, ప్రాజెక్టులు నిర్వహణపై పట్టింపు లేదన్నారు. ప్రాణహిత జలాల వినియోగంపై దృష్టి సారించలేక పోయింది సర్కారు అంటూ మండిపడ్డారు తీవ్ర స్థాయిలో.
మేడిగడ్డ రిపోర్ట్ వచ్చినా పునర్నిర్మాణం చేయట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. తొందరలో పార్టీ మారే నిర్ణయం ఉంటుందన్నారు. పార్టీ మారే విషయం రెండు వారాల్లో అన్ని బయటకు వస్తాయన్నారు. రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్తాదో అదే పార్టీలో చేరతానని ప్రకటించారు .















