ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇతర వ్యాపారస్తుల కంటే భిన్నంగా వ్యవహరిస్తారు. ఈ దేశం అంటే వల్లమాలిన అభిమానం. కష్టపడి పని చేసే వాళ్లు, నిత్యం స్పూర్తి దాయకంగా ఉండే వ్యక్తుల గురించి తను ప్రస్తావిస్తూ వుంటారు సోషల్ మీడియా వేదికగా. నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒకటి మోటివేషన్ ఇచ్చేలా పోస్టులు షేర్ చేస్తుంటారు. తన అభిప్రాయలను నిక్కచ్చిగా చెబుతుంటారు. అటు బిజినెస్ మెన్ గా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ చాలా స్పోర్టివ్ గా ఉండే వాళ్ల గురించి రాస్తుంటారు. ఈ ప్రపంచానికి తెలియ చేస్తుంటారు.
తాజాగా ఆయనను ఓ వృద్దుడు కదిలించాడు. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని చలించి పోయాడు. అదేమిటంటే కోల్‌కతా వీధుల్లో వయోభారం, జీవనోపాధి కోసం నిత్యం పోరాడుతూనే వయొలిన్ వాయించే 80 ఏళ్ల కళాకారుడు భగవాన్ మల్లిక్ కథ ఆనంద్ మహీంద్రాను కదిలించింది. కంటి చూపు మంద గించినప్పటికీ, ఈ వృద్ధుడు ప్రతిరోజూ బస్ స్టాండ్ దగ్గర వయొలిన్ వాయిస్తూ రోజుకు వంద రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ వృద్ధుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి స్పందించిన ఆనంద్ మహీంద్రా, ఆ వృద్ధుడికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. ఆ వృద్ధ దంపతుల వివరాలు పంపాలని ఆయన కోరగా, నెటిజన్లు వారి చిరునామాను అందించారు.


















