సింగపూర్ : సింగపూర్ దేశంలో శాంతిభద్రతల నిర్వహణ, అత్యవసర సమయాల్లో ప్రభుత్వ విభాగాలు ఎలా స్పందించాలో నిర్దేశించే ఈ కోఆర్డినేషన్ హబ్ పనితీరు అమోఘం అని ప్రశంసించారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. దేశంలో ఏ మూల ఏ విపత్తు లేదా భద్రతా సమస్య తలెత్తినా, పోలీస్, సివిల్ డిఫెన్స్ విభాగాలను ఏకతాటిపైకి తెచ్చి సమన్వయపరిచే విధానాన్ని ప్రతినిధులు మాకు వివరించారని అన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి అంతర్గత భద్రతకు అత్యంత కీలకమైన ‘న్యూ ఫినిక్స్ పార్క్’లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ (Operation Command Centre) ను మంత్రివర్గ సహచరులతో కలిసి సందర్శించడం జరిగిందని తెలిపారు.
ప్రధానంగా నగరం అంతటా ఉన్న కెమెరాలు, సెన్సార్ల ద్వారా నిరంతరం రియల్ టైమ్ మానిటరింగ్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , అధునాతన డేటా అనలిటిక్స్ ఉపయోగించి నేరాలను అరికట్టడం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని చెప్పారు వంగలపూడి అనిత. ముఖ్యంగా డ్రగ్స్, ఉగ్రవాదం వంటి ముప్పులను ఎదుర్కోవడంలో సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న వ్యూహాలను అధ్యయనం చేశామన్నారు..
కేవలం పర్యవేక్షణే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక ఊహాజనిత సంక్షోభాన్ని సృష్టించి, దానికి పరిష్కారం చూపే ‘సిమ్యులేషన్ ఎక్సర్‌సైజ్’ శిక్షణ పద్ధతులపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇంటర్పోల్ (INTERPOL) వంటి అంతర్జాతీయ విభాగాలతో కలిసి పనిచేసే ఈ కేంద్రం అనుభవాలు మన రాష్ట్ర భద్రతా వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు వంగలపూడి అనిత. సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత రక్షణ కల్పించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.
















