హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బుధవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి.. ప్రశ్నించడం జరిగిందని తెలిపారు.
సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఈ రోజుకు విచారణను ముగించి ఆయన వెళ్ళేందుకు అనుమతించిందని వెల్లడించారు సీపీ సజ్జనార్. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియ చేశామన్నారు సీపీ.
ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఈరోజు హరీష్ రావును విచారించింది కేవలం క్రైమ్ నం. 243/2024 (ఫోన్ ట్యాపింగ్ కేసు)కు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు సజ్జనార్.
