అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్బంగా ఉద్యోగ సంఘాలు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచడం, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు వివరించారు.
సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ది కలుగుతోందని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా సీపీఎస్, పీఎస్ యూ ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల, సొసైటీలు, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు.
