అమరావతి : అర్నబ్ తుపాను దెబ్బకు ఏపీ విల విల లాడుతోంది. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలతో పాటు ఎడ తెరిపి లేకుండా గాలుల తీవ్రతకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్బంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు. ఆయా జిల్లాల కలెక్టర్లలతో సమాచారం తెప్పించుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
తుఫాను , భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను, సుబ్బరాజుపేటను , ఇతర ప్రభావిత ప్రాంతాలను నేను స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా విద్యుత్ , టెలిఫోన్ వ్యవస్థలకు అంతరాయం కలగడాన్ని గుర్తించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, అధికారులతో ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయంపై ఆధారపడిన నిడదవోలు నియోజకవర్గంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోవడం చాలా బాధాకరం అని అన్నారు కందుల దుర్గేష్. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. పరిస్థితిని వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తుపాను వల్ల జరిగిన పంట నష్టం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అవసరమైన సహాయక చర్యలపై తాము దృష్టి సారిస్తామని చెప్పారు.
