ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్ వేగా మారుస్తాం

ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్

hellotelugu-NaaraLokesh

విశాఖపట్నం : మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలు కోరుకుంటున్నామని, సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పని చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో విశాఖ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా గారితో కలిసి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉందన్నారు. విశాఖ భారతదేశ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి నిలయం. నేడు వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ముఖ్యమైన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు శతాబ్దాల నాటివి. ఆధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రాకముందే మన తీర ప్రాంతాల మధ్య వ్యాపారులు, పరిశోధకులు ప్రయాణాలు చేస్తూ వస్తువులు, విజ్ఞానం, సంస్కృతిని పరస్పరం పంచుకునేవారని అన్నారు. కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు ఈ సంబంధాల్లో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి. నేడు ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం ద్వారా ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉంది. అందుకే ఈ సదస్సుకు కనెక్టివిటీ-కన్వర్జెన్స్-కోఆపరేషన్ అనే థీమ్ ను ఎంచుకోవడం జరిగిందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కార్యక్రమాల ద్వారా మెరుగైన నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నాం అన్నారు. భారత నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.70,000 కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో రూ.25,000 కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉంది. భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని తెలిపారు. . మన ఆర్థిక అభివృద్ధికి మెరుగైన నౌకాశ్రయాలు, నౌకాయాన మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. ప్రతి నూతన నౌకాశ్రయం పరిశ్రమలకు, వ్యాపారాలకు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.

ఇటీవల మనీలాలో జరిగిన భారత్-ఏసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మోదీ అనుసంధానం, పరిశోధన, విపత్తుల నిర్వహణ, సముద్ర భద్రత వంటి అంశాలతో కూడిన దీర్ఘకాలిక సముద్ర సహకార ప్రణాళికను ప్రతిపాదించి పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని స్పష్టం చేశారని అన్నారు లోకేష్. ఈ దార్శనికతను సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Exit mobile version