విజయవాడ : రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) నిర్వహించిన రెండవ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ (ఎన్నికైన, ఓటమి చెందినవారు) తమ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 99 పట్టణ స్థానిక సంస్థల్లో 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పూర్తయ్యాయని, మురసు తుపాను కారణంగా చీరాల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు, ఫలితాలను 6వ తేదీన ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్ 617(C), ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965లోని సెక్షన్ 343 ZD ప్రకారం, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన తుది వివరాలను సమర్పించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్దేశిత నమూనాలను, మార్గదర్శకాలను జారీ చేసిందని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. నిర్ణీత గడువులోగా ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించని అభ్యర్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు గడువులోగా వివరాలు సమర్పించక పోతే మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందని తెలిపారు. అదేవిధంగా ఎన్నికైన అభ్యర్థులు వివరాలు సమర్పించకపోతే తమ పదవులను కోల్పోవడంతో పాటు, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని కమిషనర్ పేర్కొన్నారు. కావున, జిల్లాల్లోని ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఈ విషయంపై స్థానిక పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల వ్యయ వివరాలను సేకరించే బాధ్యతను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు చేపట్టి, అందరూ గడువులోగా వివరాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ నిర్ణీత గడువులోగా తమ ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజ్ఞప్తి చేశారు
