ఎల్‌నినో సవాళ్లపై తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్

గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఏర్పాట్ల‌పై సీఎం స‌మీక్ష

hellotelugu-ElNinoEffect

హైద‌రాబాద్ : ఎల్ నినో ప్ర‌భావం నుంచి గ‌ట్టెక్కేందుకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు సీఎం కీల‌క ఆదేశాలు జారీ చేశారు. సాగు నీటికి స‌రిప‌డా నీళ్లు లేవ‌ని, తాగేందుకు రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ్లోబ‌ల్ స‌మ్మిట్ పై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 8న ప్రత్యేకంగా తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. కరువును తట్టుకునే వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రత, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాలను సంపదగా మార్చడం వంటి ఐదు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. వాతావరణ మార్పులపై గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తక్షణ చర్యలతోపాటు దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ఈ సదస్సు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం తోపాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version