చెన్నై : సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ, తమిళనాడు పరిశీలకురాలు డీకే అరుణ భరత సింహా రెడ్డి. తమిళనాడులోని వేల్లూర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ పాదయాత్ర, భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల, ప్రజల ఆత్మీయ స్వాగతం, వారిలోని ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు .సభ వేదికగా ప్రతిపక్షాలు సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) పై చేస్తున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ఎలా తిప్పికొట్టాలో స్పష్టంగా వివరించడం జరిగిందన్నారు డీకే అరుణ భరత సింహారెడ్డి. 13 కోట్ల ఓట్ల తొలగింపు అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించడం చట్టబద్ధమైన ప్రక్రియ అని పేర్కొన్నారు .
అక్రమ వలసదారుల ఓట్లను కాపాడేందుకు కాంగ్రెస్ పడుతున్న తాపత్రయాన్ని ప్రజల ముందు ఎండగట్టాం అన్నారు. మన దేశంలో 8 సార్లు ఓటరు జాబితా సవరణలు జరిగితే, అందులో అత్యధిక సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్న సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు డీకే అరుణ భరత సింహా రెడ్డి . ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం దిశగా దేశం దూసుకు పోతుంటే… ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అందుకే ప్రతిపక్షాలకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు. ప్రధానిగా నాలుగోసారి కూడా నరేంద్ర మోదీ కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు .
