అమరావతి : మత్స్యకారులు, ఆక్వా రైతులకు తీపి కబురు చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సర్కార్ మత్స్యకారులు, ఆక్వా రైతులకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేవలం వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం ఇవ్వడం మాత్రమే కాకుండా, వలసలు వెళ్లే మత్స్యకారులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. దీర్ఘ తీరరేఖ కలిగిన రాష్ట్రం కావడంతో తీరం అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యమని, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఆక్వా రంగానికి ఊతమిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ తగ్గించి, రంగం అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. తీవ్ర తుఫానులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ముందస్తు చర్యలు, హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు.
ఇందుకు అనుగుణంగా వ్యాపార అవకాశాల వృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, తీర ప్రాంత ప్రజలు తమ పరిధిలో వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అచ్చెన్నాయుడు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, సామాజిక ఆర్థిక రంగాలలో ఉన్నతి సాధించాలని కోరారు. సముద్రమే జీవనోపాధిగా చేసుకున్న గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి అభివృద్ధి, భద్రత, ఆత్మగౌరవం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అని పునరుద్ఘాటించారు.
