హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదుల వెల్లువ‌

ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ప‌లువురు బాధితులు, స్థానికులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గేటెడ్ క‌మ్యూనిటీలు కాక‌పోయినా గేట్లు పెట్టి, ర‌హ‌దారుల‌కు అడ్డంగా ప్ర‌హ‌రీలు నిర్మించి రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల్పిస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. కీస‌ర మండ‌లం, కాప్రా మున్సిపాలిటీలోని ఓవ‌ర్‌సీస్ బ్యాంకు కాల‌నీ.. వాస్త‌వానికి గేటెడ్ క‌మ్యూనిటీ కాద‌ని, అయిన‌ప్ప‌టికీ నాలుగు కాల‌నీల‌కు దారి లేకుండా అడ్డంగా ఫెన్సింగ్ వేయ‌డం, గేట్లు పెట్టడం చేశార‌ని శ్రీ‌ ప‌ద్మారావు న‌గ‌ర్ కాల‌నీ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండ‌లం సురారం విలేజ్ సిద్ధి వినాయ‌క‌న‌గ‌ర్‌లోని 30 ఫీట్ల ర‌హ‌దారిని క‌బ్జా చేసేయ‌డంతో న‌ర్సాపూర్ మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే దారి లేకుండా పోయింద‌ని అక్క‌డి నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నాచారంలోని స‌ర్వే నంబ‌రు 157, 162లో గ‌ల లే ఔట్‌లో 416 గ‌జాలున్నా ప్లాట్‌ను ప‌క్క‌నే ఉన్న రోడ్డును ఆక్ర‌మించి 639 గజాలు చేసుకుని మ‌ల్గీలు నిర్మించి అద్దెల‌కు ఇచ్చుకున్నార‌ని.. ర‌హ‌దారిని కాపాడాల‌ని అక్క‌డి నివాసితులు కోరారు. జీడిమెట్ల డివిజ‌న్ ఎస్ ఆర్ నాయ‌క్ న‌గ‌ర్ కాల‌నీ పేరిట 1984లో లే ఔట్ వేయ‌గా 11 వేల గ‌జాల స్థ‌లాన్ని పార్కుకోసం, ప్ర‌జావ‌స‌రాల‌కు కేట‌యించారని తెలిపారు. ఇప్పుడా స్థ‌లం క‌బ్జాకు గురౌతోంద‌ని కాల‌నీ ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో పిర్యాదు చేశారు. షేక్‌పేట్ మండలం, రోడ్ నెం.2లోని సర్వే నెం.129/11 పరిధిలోని దాదాపు 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు జ‌రుపుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. ఇలా హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 43 ఫిర్యాదులు అందిన‌ట్లు హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య వెల్ల‌డించారు. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Exit mobile version