మా ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు

పోలీస్ ఉన్నతాధికారులపై హరీష్ రావు కామెంట్స్

hellotelugu-HarishRao

సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారిని వదిలేసి, ఆధారాలతో ఫిర్యాదు చేసిన క్రిశాంక్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్ లతో అణచి వేసే కుట్ర జరుగుతోందన్నారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి మా ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్లను.. రేపు రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని , వారి ప‌ని ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. రాబోయేది త‌మ స‌ర్కారేన‌ని జోష్యం చెప్పారు. ఇదే స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తుంటే రేవంత్ రెడ్డి వంద కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడంలో బిజీగా ఉన్నారంటూ మండిప‌డ్డారు..సన్నవడ్లకు బోనస్ ఇస్తారో లేదో సీఎం తేల్చాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంద‌న్నారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఫ‌క్తు రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని ఫైర్ అయ్యారు హ‌రీశ్ రావు.

Exit mobile version