విద్యార్థుల యూనిఫాంలు ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలి

అధికారుల‌ను ఆదేశించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : విద్యార్థులకు అందించే యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజైన్లలో వైవిధ్యం ఉండేలా కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలు , ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు ఈ ఏడాది ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను ఈ నెలాఖరులోగా అందిస్తామని అధికారులు సమావేశంలో తెలిపారు. కేజీబీవీలు, మోడల్ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే రెండు జతల యూనిఫాంలు అందించామని వారు పేర్కొన్నారు.

విద్యార్థులందరికీ నోట్‌బుక్‌ల పంపిణీ పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, స్పూన్లు, బకెట్లు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవల్స్ పంపిణీ పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది పాఠశాలలు తిరిగి తెరిచే రోజునే విద్యార్థులకు యూనిఫాంలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుండే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో పాటు అదనంగా మరో 10 శాతం మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని ఆయన అన్నారు.

ఈ ఏడాది అందించిన యూనిఫాంలు, ఇతర సామగ్రి నాణ్యత పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version