అమరావతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన ఉచిత ఇసుక పథకం బడుగు బలహీన వర్గాలకు ఉపాధిని కల్పించడంతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎంతగానో తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8,94,745 మంది ఇసుక పథకాన్ని ఉపయోగించు కోవడం జరిగిందన్నారు. 2,12,50,817 మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను ఇప్పటి వరకు సరఫరా చేశాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో నిర్మాణ రంగం కూడా వేగంగా ఊపందుకుందన్నారు. జగన్ హయాంలో ఉపాధి లేక ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైందని ఆరోపించారు. లక్షలాది మంది కార్మికులు పనిలేక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారన్నారు. దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఉపాధి లేక రోడ్డున పడ్డారని వాపోయారు. ఇసుక ధర భారీగా పెంచడంతో ఇళ్ల నిర్మాణం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పథకంతో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తిరిగి ఏపీకి వచ్చి ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఉచిత ఇసుక పథకంతో బడుగు బలహీన వర్గాల సొంతింటి కల స్వప్నాన్ని సాకారం చేసిందన్నారు. కృత్రిమ కొరత బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో ఉచిత ఇసుకను పంపిణీ చేస్తోందని వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతికి తోడ్పతుందని తెలిపారు. సొంత నివాస గృహాల నిర్మాణానికి, పశువుల పాకతో తొట్ల నిర్మాణానికి చేయూతనిస్తోందని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానం ద్వారా తాపీ పనివారు, వడ్రంగిలు, ప్లంబర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లతో సహా వివిధ రంగాలకు చెందిన సుమారు 80 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు.. కూలీల చేతికి నిరంతరం ఉపాధి లభిస్తూ రాష్ట్ర ప్రగతికి సరికొత్త పునాదిలా ఈ విధానం పనిచేస్తోందన్నారు అనగాని సత్య ప్రసాద్. వైసీపీ ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాలకు ఇసుకను సరఫరా చేస్తూ రాష్ట్రంలో లారీ ఇసుకను రూ.లక్ష చొప్పున విక్రయించారని ఆరోపించారు. నేడు బ్లాక్ మార్కెట్‌కు తావు లేకుండా ఇసుక అందరికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
