తిరుపతి : భక్తి, జ్ఞానం, యోగ సాధనల సమన్వయంతో వెలుగొందిన మహనీయురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డా. మేడసాని మోహన్ అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి తత్వం అనే అంశంపై డా. మేడసాని మోహన్ ప్రసంగించారు. వెంగమాంబ భక్తి కేవలం ఆరాధనకు పరిమితం కాలేదని, సంపూర్ణ శరణాగతి, దైవానుభూతికి ప్రతిరూపంగా నిలిచిందని తెలిపారు.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై ఆమెకున్న అచంచలమైన విశ్వాసం, ఆత్మ నివేదన ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తాయని చెప్పారు. భక్తి, భావోద్వేగం, ఆత్మానుభూతి సమన్వయంతో సాగిన ఆమె సాహిత్యం నేటికీ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.
తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. వేమా వేంకట రత్నం మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. నైతిక విలువలను పాటిస్తూ ధార్మిక జీవనం సాగించాలని ఆమె జీవితం సందేశమిస్తుందని తెలిపారు. వెంగమాంబ రచనలు జనరంజకమైన, సరళమైన భాషలో ఉండటంతో అన్ని వర్గాల ప్రజలకు సులభంగా చేరువయ్యాయని చెప్పారు. ఆమె సాహిత్యంలో భక్తి, ఆధ్యాత్మిక చింతన, యోగసాధన, దైవానుభూతి స్పష్టంగా ప్రతిఫలిస్తాయని వివరించారు. వెంగమాంబ జీవితం, సాహిత్యం సమాజంలో భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే శక్తివంతమైన ప్రేరణగా నిలిచాయని అన్నారు.
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్. ఆనం తీర్థాచార్యులు మాట్లాడుతూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఉండేవని తెలిపారు. తన రచనల ద్వారా శ్రీవారి వైభవాన్ని, భక్తి తత్వాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారని చెప్పారు. వెంగమాంబ సాహిత్యంలో భక్తి, శరణాగతి, ఆధ్యాత్మిక చింతనతోపాటు ఉన్నతమైన సాహిత్య విలువలు సమృద్ధిగా కనిపిస్తాయని పేర్కొన్నారు. శ్రీవారితో ఆమెకున్న అనుబంధం, ఆత్మీయ భక్తి ప్రతి రచనలోనూ ప్రతిధ్వనిస్తుందని తెలిపారు. తెలుగు సాహిత్యంలో వెంగమాంబ రచనలు విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయని, నేటి తరానికి కూడా భక్తిమార్గాన్ని చూపుతున్నాయని వివరించారు.
ప్రముఖ సాహితీవేత్త గంగవరం శ్రీదేవి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – యోగ జీవనం” అనే అంశంపై ప్రసంగించారు. వెంగమాంబ జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తికి అంకితమైందన్నారు. ఆమె రచనలు నాటి సమాజంలోని లోపాలను ప్రశ్నించడంతో పాటు, నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేసి భక్తి, తపస్సు, ఆత్మసాక్షాత్కారానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా ఆమె శ్రీవారి భక్తి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని వివరించారు.

















