మోహినీ అవతారంలో పల్లకిపై దివ్య విహారం

అనుగ్రహించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

hellotelugu-PallakiUtsavam

తిరుప‌తి : తిరుప‌తి లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం అప్పలాయగుంటలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్స‌వాల‌లో భాగంగా సోమవారం స్వామి వారు మోహినీ అవతారంలో పల్లకిపై విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు. స్వామివారి మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. గోవింద నామస్మరణతో మాడవీధులు మారు మ్రోగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పల్లకీ వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, గోవింద నామ స్మరణల మధ్య స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

అనంతరం ఉదయం 10.00 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయ‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు.

Exit mobile version