తిరుపతి : పలమనేరులోని ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 14న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ .. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డితో కలిసి దీప పూజ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నారు. వేలాది మంది భక్తుల కోసం విశాలమైన షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, అన్నప్రసాద పంపిణీ కేంద్రాలు, తాగునీటి సౌకర్యం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు దీప పూజ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, సుందర పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని జేఈవో వెల్లడించారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పూజా ప్రాంగణంలో పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు. శ్రీ మహాలక్ష్మీ దీప పూజలో పాల్గొనే భక్తుల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన మరింతగా పెంపొందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు . శ్రీ మహాలక్ష్మీ దీప పూజ మహోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేఈవో తెలిపారు. భక్తులు ఈ దివ్య దీప పూజను వీక్షించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
















