తిరుపతి : చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మే 1వ తేదీ శుక్రవారం రోజున శ్రీ గోవిందరాజ స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగనుందని టీటీడీ వెల్లడించింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం నుండి ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు, ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్ తదితర దేవేరులు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు జరుగుతాయి.
సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ గోవిందరాజ స్వామి వారు వచ్చే సమయంలో అమ్మ వారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావ గారైన శ్రీ గోవింద రాజస్వామి వారు వచ్చారని శ్రీ పద్మావతీ అమ్మ వారు లోపల నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది . అక్కడి నుండి స్వామివారు తిరిగి ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఉత్సవం ముగుస్తుంది.


















