వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవం

శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆల‌యంలో

hellotelluguJyestabhishekam

తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు స్వామి వారికి దివ్య కవచ సమర్పణతో ఘనంగా ముగిశాయి.ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి కవచాలను ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకు వచ్చారు. తదుపరి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజస్వామి వారి ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం కవచ ప్రతిష్ఠ, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోషల మధ్య ఆస్థానం జరిపారు. చివరగా స్వామి వారు, అమ్మవార్లకు పవిత్ర కవచాలను సమర్పించి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవంగా ముగించారు.

సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవింద రాజస్వామి వారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version