తిరుపతి జిల్లా : ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై లోక్‌సభలో గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
తిరుపతి జిల్లాలో పథకం అమలు వివరాలను వెల్లడిస్తూ జిల్లాలో 15,553 పశువులకు బీమా చేసి రూ.2.89 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రైతులకు 1,463 పశుగ్రాసం మిని కిట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పశు సంవర్థక రంగంలో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అందించే కార్యక్రమంలో భాగంగా 62 మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో రూ.5.89 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనాల విషయానికొస్తే, తిరుపతి జిల్లాలో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ కింద 36 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు నేరుగా లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 1,094 మంది ఎస్సీ రైతులు, 118 మంది ఎస్టీ రైతులు పరోక్షంగా ఈ పథకం కింద ప్రయోజనం పొందినట్లు వివరించారు.
