అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని వెల్లడించారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. నేచురల్ ఫార్మింగ్‌ను బలహీనపరచి, రైతులకు నష్టం కలిగించే విధానాలు వైసీపీ హయాంలో అమలయ్యాయని విమర్శలు చేశారు. అదే సమయంలో డ్రిప్ ఇరిగేషన్ పథకంలో సుమారు రూ.1,100 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంచిన కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించి వ్యవస్థను బలోపేతం చేసామన్నారు. ఫలితంగా డ్రిప్ ఇరిగేషన్‌లో రాష్ట్రం వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే ప్రథమ స్థానం సాధించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇది సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేసి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని వాపోయారు. వ్యవసాయం, సాగునీరు, పంటల మద్దతు ధరలు, బీమా, సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి కీలక రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ అన్ని వ్యవస్థలను పునరుద్ధరించిందని, అన్ని రంగాల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించడం మానుకుని, తన పాలనలో జరిగిన వైఫల్యాలకు జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇకపై పనిచేయవని, రైతులు ఇప్పటికే వాస్తవాలను గుర్తించారని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
