రూ. 273 కోట్ల‌తో పొగాకు రైతుల‌కు స‌ర్కార్ భ‌రోసా

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పొగాకు రైతుల‌కు పూర్తి భ‌రోసా త‌మ ప్ర‌భుత్వం క‌ల్పిస్తోంద‌ని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. అంత‌ర్జాతీయ మార్కెట్ నిర్ణ‌యాల మేర‌కు ధ‌ర నిర్ణ‌యించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. కొంద‌రు కావాల‌ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారని వీటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. వైసీపీ హయాంలో 2020లో మాత్రమే ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 12,931 మెట్రిక్ టన్నుల పొగాకును రూ.108 కోట్లతో కొనుగోలు చేసి, తర్వాత నాలుగేళ్లు రైతులను పట్టించు కోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం హెచ్‌డీ బర్లీ మార్కెట్ సంక్షోభ సమయంలో రూ.273 కోట్లకు పైగా వెచ్చించి రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసి అండగా నిలిచిందని చెప్పారు. హెచ్‌డీ బర్లీ, వర్జీనియా (FCV) పొగాకు మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ వ్యాఖ్యలు చేయడం విచారకరం అన్నారు. FCV పొగాకు కేంద్రంలోని పొగాకు బోర్డు పరిధిలో ఉండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్రం, పొగాకు బోర్డు, కొనుగోలు సంస్థలతో సమన్వయం చేసి కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.

ఈ-పంట నమోదుపై జగన్ చేస్తున్న ఆరోపణలను గణాంకాలే ఖండిస్తున్నాయన్నారు. వైసీపీ హయాంలో ఖరీఫ్-2024లో 41.87 లక్షల మంది రైతుల 96.78 లక్షల ఎకరాలు మాత్రమే నమోదు కాగా, కూటమి ప్రభుత్వం ఖరీఫ్-2025లో 53.32 లక్షల మంది రైతుల 117.39 లక్షల ఎకరాలు నమోదు చేసి గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. ల్యాండ్ పార్సిల్స్ నమోదు 106.38 లక్షల నుంచి 198.93 లక్షలకు పెరిగింది. అలాగే రబీ 2025-26లో 99.7% ఈ-పంట నమోదు పూర్తి చేసి, సాంకేతికతతో రైతులకు సబ్సిడీలు, బీమా, పెట్టుబడి సాయం తదితర పథకాలు పారదర్శకంగా, వేగంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వ పనితీరు గణాంకాల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నా, జగన్ అసత్య ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు.

Exit mobile version