హైదరాబాద్ : దేవాదాయశాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ రోజు బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్( ఆడిటోరియం (దేవులపల్లి రామానుజరావు కళామందిరం) వేదికగా జరిగిన ఉద్యోగుల పదోన్నతుల కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరిలో 48 మంది ఉద్యోగులు గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరు గ్రేడ్ 2 ఈవోలుగా, ఒకరు గ్రేడ్ 1 ఈవోలుగా మంత్రి సురేఖ చేతులు మీదుగా పదోన్నతుల ఉత్తర్వులను అందుకున్నారు. వీరితో పాటు అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్హులైన 15 మంది అర్చకులకు (వారి కటుంబ సభ్యులు) పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీ, వివాహ రుణం మంజూరు ఉత్వర్వులను మంత్రి అందించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతులు అందుకున్నవారితో కలిపి గతంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కేటగిరీల్లోనూ పదోన్నతులు ఇవ్వడం ద్వారా మొత్తం 168 మంది ఉద్యోగులకు కార్యనిర్వహణాధికారులుగా పదోన్నతి కల్పించి, ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపామని అన్నారు. సరిగ్గా పది రోజుల క్రితం రవీంద్రభారతి వేదికగా వేద పండితులు, అర్చకులు, పరిచారకులు, డోలు, సన్నాయి కళాకారులు తదితర 191 ధార్మిక నియామక ఉత్తర్వులు అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.
అర్చక సంక్షేమ నిధి కింద పదవీ విరమణ, మరణ గ్రాట్యుటీని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడంతో పాటు అంత్యక్రియల సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచి అర్చక కుటుంబాలకు మరింత భరోసా కల్పించామని మంత్రి తెలిపారు. సరస్వతి నది ఆది, అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, గోదావరి పుష్కరాలు (2027), కృష్ణ పుష్కరాలు (2028) కోసం ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాలు అంటే తెలంగాణ అనే స్థాయిలో రానున్న పుష్కరాలు చేపడతామని మంత్రి సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరక్టర్ హనుమంతరావు, రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (SITA) డైరక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ఆర్జెసి రామకృష్ణారావు, డిప్యూటి కమిషనర్ వినోద్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు జ్యోతి, శ్రీనివాస్, ఈవోల సంఘం అధ్యక్షుడు నరేందర్, టెంపుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగ జాక్ కన్వీనర్ డి.వి.ఆర్.శర్మ పాల్గొన్నారు.

















