అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకు వస్తామని తీపి కబురు చెప్పారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా/ఆత్రేయపురం , పిచ్చుకలంక గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం అన్నారు సీఎం. .గోదావరి డెల్టాకు కీలకమైన ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఆధునీకరిస్తున్నాం అని తెలిపారు. రూ.152 కోట్లతో 117 కొత్త గేట్లను బిగిస్తున్నాం.. ధవళేశ్వరం బ్యారేజీని సంరక్షిస్తాం అని చెప్పారు.దేశానికే అన్నపూర్ణ అనే పేరు గోదావరి డెల్టాకు దక్కిందంటే. దానికి కారణం కాటన్ మహాశయుడేనని గుర్తు చేశారు. కాటన్ బ్రిటిషర్ అయినా ఇక్కడి ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని చెప్పారు సీఎం.
ఊరూరా విగ్రహలు పెట్టారని తెలిపారు. కాటన్ నిర్మించిన బ్యారేజీ తర్వాత మరో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. గోదావరిపై కొత్త బ్యారేజీని ప్రారంభించింది ఎన్టీఆర్ అని చె్పారు. గోదావరిపై కొత్త బ్యారేజ్ నిర్మాణంతో మరో పంటకు నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు.
కొత్త బ్యారేజీ నిర్మాణం తర్వాత 2.9 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే వీలు కలిగిందన్నారు. 32.2 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా కొత్త బ్యారేజీ నిర్మాణం చేపట్టారని తెలిపారు సీఎం. ఈస్ట్రన్, సెంట్రల్, వెస్ట్రన్ డెల్టాలకు మొత్తంగా 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా కొత్త బ్యారేజీ నిర్మాణంతో వెసులుబాటు కలిగిందన్నారు .కొత్త బ్యారేజీ నిర్మాణం జరిగిన 50 ఏళ్లు కావడంతో గేట్లు, మోటార్లు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం.


















